Monday, August 6, 2018

గజ్వేల్ విద్యాహబ్

*💥గజ్వేల్ విద్యాహబ్*
   
♦దేశానికే తలమానికం 

♦ఒకే ఆవరణలో కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానం 

♦60 ఎకరాల్లో ఐఐటీ, ఐఐఎం తరహాలో భవనాల నిర్మాణాలు

♦బాలబాలికలకు వేర్వేరుగా ఏర్పాట్లు.. 

♦ఉత్తమ బోధన.. పోటీపరీక్షలకు కోచింగ్

♦నిర్మాణాలు, అభివృద్ధి కోసం రూ.146.28 కోట్లు కేటాయింపు 

♦త్వరలో ఇతర జిల్లాలకు విస్తరణ 

♦హైదరాబాద్: గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన విద్యాహబ్ దేశానికే తలమానికంగా నిలువబోతున్నది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఒకే ఆవరణలో ఐఐటీ, ఐఐఎం తరహాలో భవనాలను నిర్మిస్తున్నారు. ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానంలో భాగంగా 6వ తరగతి నుంచి పీజీ వరకు ఒకే ఆవరణలో అన్ని రకాల విద్యాసంస్థలను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ పాఠశాలతోపాటు కేజీబీవీలు, మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పీజీ కాలేజీలను ఒకే క్యాంపస్‌లో నిర్మించిన ఘనత దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. కేజీ టు పీజీ విద్యావిధానాన్ని అమలుచేస్తామని గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టే క్రమంలోనే సీఎం కేసీఆర్ ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గజ్వేల్‌లో 20 ఎకరాల్లో బాలికల కోసం విద్యాహబ్‌ను నిర్మించారు. దానికి ఒక కిలోమీటర్ దూరంలో 40 ఎకరాల్లో బాలుర కోసం విద్యాహబ్‌ను ఏర్పాటు చేశారు. సువిశాలమైన తరగతి గదులు, భోజనశాలలు, గ్రంథాలయాలు, ల్యాబులు ఉత్తమ ప్రమాణాలతో రూపొందించారు. వివిధ భవనాల మొత్తం విస్తీర్ణం 4,58,902 చదరపు అడుగులు. ప్రపంచశ్రేణి ప్రమాణాలతో, ధారాళంగా గాలి వెలుతురు వచ్చేలా అక్కడ చదువుకునే విద్యార్థులకు, బోధకులకు ఆహ్లాదంతోపాటు మంచి వాతావరణం ఉండే విధంగా నిర్మాణాలను చేపట్టారు. విశాలమైన తరగతి గదుల్లో పగటివేళల్లో కరంట్ లైట్ ఎక్కువ అవసరం లేనివిధంగా భవనాలను నిర్మించారు. అన్ని తరగతులవారు ఉపయోగించుకునే విధంగా ఉన్నతస్థాయి ప్రమాణాలతో సైన్స్‌ల్యాబులు రూపొందించారు. ఉత్తమ బోధనతోపాటు పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ ఏర్పాట్లు చేశారు. నిర్మాణాలు, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.146.28 కోట్లు కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతి సదుపాయాల సంస్థ (టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ) ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. త్వరలో మరికొన్ని జిల్లాల్లో విద్యాహబ్‌లు నిర్మించేందుకు చర్యలు ప్రారంభించారు. 

*💥కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా*..

♦దేశానికి ఆదర్శవంతంగా నిలుస్తున్న గజ్వేల్ విద్యాహబ్‌లో నిర్మించిన భవనాలు కార్పొరేట్ విద్యాసంస్థలను మైమరిపించే విధంగా ఉన్నా యి. రూ.146.28 కోట్లతో విద్యాహబ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పచ్చదనం, మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టారు. 1,200 మంది విద్యార్థుల సామర్థ్యంతో హైటెక్ ప్రమాణాలతో పెద్ద ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నారు. విద్యాహబ్‌ను విద్యాప్రమాణాలకు అనుగుణంగా, కేంద్రప్రభుత్వ ప్రమాణాల ప్రకారం నిర్మించారు. దానిప్రకారం ప్రతి క్యాంపస్‌లో 2,500 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో మరో 1,000 మంది విద్యార్థులు కూడా ఈ క్యాంపస్‌లో చదుకోవడానికి అనుగుణంగా నిర్మాణాలు ఉన్నాయి.

*💥ఇంగ్లిష్ మీడియంలో బోధన*

♦గజ్వేల్ విద్యాహబ్‌లో ప్రతి ఒక్క విద్యార్థి ప్రపంచస్థాయికి ఎదిగే విధంగా విద్యాబోధన కొనసాగిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు కావాల్సిన విధంగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించారు. ఇక్కడ పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే బోధన జరుగుతుంది. రాష్ట్ర స్థాయి సిలబస్‌ను కొనసాగిస్తున్నారు. ఇక్కడ బోధకులు సబ్జెక్టు నిపుణులు. రోజువారీ పాఠాలతోపాటు ప్రతి రోజూ స్టడీ అవర్‌ను నిర్వహిస్తున్నారు. పాఠాలు చెప్పిన తర్వాత స్టడీ అవర్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఇక్కడి విద్యాహబ్‌లో ప్రవేశం కోసం తీవ్ర పోటీ ఏర్పడుతున్నది. సిబ్బందిపైనా ఒత్తిడి పెరుగుతున్నది. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన విద్యార్థులకు తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఇక్కడ ప్రవేశాలు పొందడానికి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాల నుంచి కూడా విద్యార్థులు రావడాన్ని చూస్తే గజ్వేల్ విద్యాహబ్‌కు ఏ విధంగా ప్రాధాన్యం పెరుగుతున్నదో అర్థమవుతున్నది. విద్యాహబ్‌లో కేవలం విద్యాబోధన మాత్రమే కాకుండా సివిల్స్ సర్వీసులు, ఐఐటీ- జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పలు రకాల పోటీపరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం సబ్జెక్టు నిపుణులతో ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రత్యేక గ్రంథాలయాలను ఏర్పాటుచేశారు. 

*💥సకల సదుపాయాలు*

♦విద్యాహబ్‌లో పలు సదుపాయాలను కల్పిస్తున్నారు. చుట్టూ ప్రహరీని నిర్మిస్తున్నారు. నాణ్యమైన రోడ్లను వేస్తున్నారు. ఆధునిక రీతిలో నీటి సరఫరా, శానిటేషన్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లే గ్రౌండ్, ల్యాండ్‌స్కేప్ విద్యార్థులకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యాహబ్‌లో అడ్మిషన్ పొందడం ఎంతో ఆనందంగా ఉన్నదని విద్యార్థులు చెప్తున్నారు. బోధకులు అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిర్మిస్తున్న గజ్వేల్ విద్యాహబ్‌కు అన్ని రకాల హంగులు ఉన్నాయని, ఇక్కడ పాఠాలు బోధించడం, పనిచేయడం కూడా తమకు ఎంతో అనుభూతినిస్తున్నదని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తెలిపారు.